మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
నర్సీపట్నం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దళితుల పట్ల జరిగిన అన్యాయాలపై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
డాక్టర్ సుధాకర్ మృతిపై మౌనం ఎందుకు?
దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతి చెందిన సమయంలో స్పందించని గణేష్‌కు ఇప్పుడు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నాయకులు విమర్శించారు. “స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సుధాకర్‌ను చంపించారు” అని కావేరి బాయి చేసిన ఆరోపణలపై గణేష్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
ఆ సమయంలో దళితులకు అన్యాయం జరుగుతుంటే ముందుకు రాని వారు, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దళితులను అడ్డం పెట్టుకోవడం సరైంది కాదని హెచ్చరించారు.
అయ్యన్నపాత్రుడి కృషితోనే సుధాకర్ కుటుంబానికి న్యాయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక చొరవతో డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంలో కీలక పాత్ర పోషించారని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంలో అయ్యన్నపాత్రుడి పాత్ర ప్రశంసనీయమని తెలిపారు.
దళితుల భూముల ఆక్రమణపై ప్రశ్నలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో దళితుల భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు గణేష్ ఎందుకు స్పందించలేదని నాయకులు ప్రశ్నించారు. దళితుల భూముల్లో సచివాలయాలు నిర్మిస్తున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ ఉన్నారని నిలదీశారు.
అప్పట్లో అయ్యన్నపాత్రుడు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి దళితుల భూములను రక్షించేందుకు పోరాటం చేశారని గుర్తుచేశారు.
గణేష్‌కు దళిత సంఘాల హెచ్చరిక
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలపై స్పందిస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు మానుకోవాలని గణేష్‌కు దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. గతంలో దళితులకు జరిగిన అన్యాయాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితుల హక్కుల విషయంలో రాజకీయాలు చేయకుండా నిజాయితీగా వ్యవహరించాలని వారు సూచించారు.
