కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా స్థానిక బీజేపీ కసరత్తుల్లో మునిగిపోయింది. ఈ సారి ఎలాగైనా ఈ నియోజకవర్గంలో కాషాయజెండా ఎగరేయాలని ఆ పార్టీ ఉవ్వీళ్లూరుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నియమితులైన వడ్డేవల్లి శరణ్ చౌదరి దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలుస్తూ కూకట్‌పల్లిలో పార్టీ, నియోజకవర్గ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారిలో ధైర్యం నింపుతున్నారు. ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంతో నియోజకవర్గంలోని కుటుంబాలను కలిసి ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కూకట్‌పల్లిలో బీజేపీ గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు సూటిగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో దేశం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తున్నట్టు వడ్డేవల్లి శరణ్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని తెలిపారు. ప్రజల ఆధారణ తమ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నదని, మోదీ పట్ల అభిమానం, బీజేపీ పట్ల ఆదరణ చూస్తుంటే, తమ లక్ష్యాన్ని మించి ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల వరకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి ప్రజల మధ్య ఉంటూ కూకట్‌పల్లిలో కాషాయ జెండా ఎగురేస్తాం అని శరణ్ చౌదరి ధీమా వ్యక్తం చేశారు.