నల్గొండ జిల్లా: ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటున్న బీసీ నేతలు



Nalgonda District Politics (Media Boss):
అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని బీసీ నేతలు.. టికెట్లు ఆశిస్తున్నారు. బీసీ వాదాన్ని ప్రత్యేకంగా తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు.

త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు వేదిక కాబోతుంది తెలంగాణ. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఆ మూడ్ లోకి వెళ్లిపోయాయి. వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్దం చేస్తూ…. పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. దాదాపు ప్రతిపక్షాలన్నీ బీఆర్ఎస్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నాయి. మూడోసారి కూడా తామే గెలుస్తామన్న ధీమాలో ఉంది గులాబీ పార్టీ. మరోవైపు నేతలు పార్టీలు మారిపోతున్నారు. అటు నుంచి ఇటు నుంచి అటు అన్నట్లు ఉంది తాజా పరిస్థితి. ఇదిలా ఉంటే…ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేతలు బీసీ వాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఈసారి తమకు ఎలాగైనా ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మధ్యనే కాంగ్రెస్ లోని కీలక నేతలు సమావేశాలు కూడా నిర్వహించుకున్న సీన్లు కనిపించాయి. ఇక అధికార బీఆర్ఎస్ లోని నేతలు కూడా… టికెట్లపై ఆశలు పెంచుకుంటున్నారు. వన్ ఛాన్స్ ప్లీజ్ అంటూ హైకమాండ్ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో బీసీ వాదం ప్రధానంగా తెరపైకి వస్తోంది. ఫలితంగా… నల్గొండ రాజకీయం రసవత్తరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

అధికార, ప్రతిపక్ష పార్టీలో సేమ్ సీన్…
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నియోజకవర్గాలను చూస్తే…. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సెగ్మెంట్లు మినహాయిస్తే మిగిలినవి 9 జనరల్ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పరంగా చూస్తే… ఇందులో ఉన్న మెజార్టీ సీట్లు కీలక నేతల చేతుల్లో ఉన్నాయి. కోదాడ, హుజుర్ నగర్ తమ అడ్డాలుగా చెప్పుకుంటున్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, ఇక సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో జానారెడ్డి, నల్గొండ, మునుగోడు, భువనగిరి సీట్లపై ఎంపీ కోమటిరెడ్డి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇక సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి వంటి నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో… ఆయా నియోజకవర్గాల్లో బీసీ నేతలు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ ఒక్కసారైనా తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మునుగోడుకు సంబంధించి పద్మశాలి సామాజికవర్గానికి చెందిన కైలాస్ నేత టికెట్ ఆశిస్తున్నారు. ఓయూ విద్యార్థి నేతగా కూడా గుర్తింపు ఉన్న తనకు ఈసారి టికెట్ ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు. ఆలేరులో చూస్తే… బీర్ల అయిలయ్య కూడా టికెట్ రేసులో ఉన్నారు. ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీసీల జనాభా ఎక్కువగా ఉంది. ఫలితంగా ఈ పరిధిలో రాజకీయాలు చేస్తున్న పొన్నాల లక్ష్మయ్య, చెరుకు సుధాకర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు వంటి నేతలు బీసీ కోటాలో సీట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… ఉదయపూర్​ డిక్లరేషన్​ కూడా అమలు చేయాలని నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ బీసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక అధికార పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మునుగోడు ఉపఎన్నికల వేళ బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి టికెట్ ఇవ్వాలని భావించినప్పటికీ అలా జరగలేదు. అయితే ఈసారి మాత్రం… ఇక్కడ్నుంచి బీసీకే టికెట్ ఇవ్వాలని స్థానిక నేతలు కోరుతున్నారు. నారాబోయిన రవి ముదిరాజ్, కర్నె ప్రభాకర్ తో పాటు గౌడ కార్పోరేష‌న్ చైర్మెన్ పల్లె రవి కుమార్ గౌడ్ కూడా గులాబీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇక సాగర్ లో చూస్తే.. నోముల భగత్ కు కాకుండా స్థానికులమైన తమకు ఈసారి ఛాన్స్ ఇవ్వాలని గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్‌ వంటి నేతలు కోరుతున్నారు. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. ఇక నల్గొండ నియోజకవర్గంలో కూడా కంచర్లకు ధీటుగా మరో బీసీ నేత కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కోదాడ నియోజకవర్గంలో వనపర్తి లక్ష్మీనారాయణ ఉన్నారు. ఈయన పెరిక సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. లక్ష్మీనారాయణ భార్య శిరీష కోదాడ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇక్కడ పెరిక సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని… ఈసారి తనకు టికెట్ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. హుజూర్ నగర్‌లో పిల్లుట్ల రఘు, కోదాడలో అంజి యాదవ్ వంటి నేతలు ఇండిపెండెంట్ గా ముందుకెళ్తున్నారు. తమకు ఏదైనా ప్రధాన పార్టీ టికెట్ ఇస్తే బరిలో నిలవాలని.. ఇవ్వకున్నా స్వతంత్రంగానైనా పోటీ చేసేందకు ఆసక్తి కనబరుస్తున్నారు.

మొత్తంగా ఎన్నికలకు ముందే కులాల వారీగా ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకునే పనిలో పడ్డారు నేతలు. దీనికి బీసీ వాదాన్ని జోడిస్తూ.. అధినాయకత్వాలను ఆలోచనలో పడేయాలని, ఎలాగైనా టికెట్ ఛాన్స్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఆయా నేతల ప్రయత్నాలను పార్టీ అధినాయకత్వాలు ఎలా చూస్తాయనేది చూడాలి..!

త్వ‌ర‌లో న‌ల్గొండ జిల్లాలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల స‌ర్వే ఫ‌లితాలు www.gamechanzer.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *