సుమలతా దేవి వర్గానిదే చట్టబద్ధమైన హక్కు: TFTDDA



  • కూకట్‌పల్లి కోర్టు కీలక ఆదేశాలు
  • సుమలతా దేవి వర్గానిదే చట్టబద్ధమైన హక్కు: TFTDDA
  • సెప్టెంబర్‌ 13న జనరల్‌ బాడీ సమావేశంపై మధ్యంతర ఇంజంక్షన్‌..
  • అసోసియేషన్‌ నిధులకు రక్షణ

హైదరాబాద్‌: తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA)లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది. అసోసియేషన్‌ పేరుతో సెప్టెంబర్‌ 13న ఇందిరానగర్‌లోని హోటల్‌ అనుపమలో నిర్వహించ తలపెట్టిన జనరల్‌ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ కూకట్‌పల్లి రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మధ్యంతర ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి వర్గానికి న్యాయపరంగా ఊరట లభించినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

సమావేశాల నిర్వహణపై ఆంక్షలు

కే. రాఘవేంద్ర, వై. మెహర్‌ బాబా తదితర ప్రతివాదులు అసోసియేషన్‌ పేరుతో ఎలాంటి జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించరాదని కోర్టు ఆదేశించినట్లు ప్రతినిధులు వెల్లడించారు. అసోసియేషన్‌కు సంబంధించిన అధికారిక లెటర్‌హెడ్‌లు, సీళ్లు, మినిట్స్‌ బుక్‌, అధికారిక సంతకాలను ఉపయోగించడంపైనా ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

అదేవిధంగా బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు, ఇతర అధికారిక సంస్థలకు అసోసియేషన్‌ తరఫున లేఖలు రాయకూడదని న్యాయస్థానం ఆదేశించినట్లు పేర్కొన్నారు. పిటిషనర్‌ సమర్పించిన ఆధారాలు, పోలీసులకు అందిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ఈ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు. కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 12కు వాయిదా వేసినట్లు వెల్లడించారు.

2025–27 కార్యవర్గమే చట్టబద్ధమని స్పష్టీకరణ

కోర్టు ఉత్తర్వుల అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి, జనరల్‌ సెక్రటరీ, ట్రెజరర్‌ ఇజ్రాయెల్‌ మాట్లాడారు. 2025–2027 కాలానికి బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ కార్యవర్గానికే అసోసియేషన్‌ పాలన, అధికారిక కార్యకలాపాలు నిర్వహించే హక్కు ఉందని వారు స్పష్టం చేశారు.

రఘు మాస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అసోసియేషన్‌ నిబంధనల ప్రకారం వి.వి. సుమలతా దేవి నాయకత్వంలోని కార్యవర్గమే చెల్లుబాటు అవుతుందని తెలిపారు.

రూ.4 కోట్ల సంక్షేమ నిధుల పరిరక్షణ

గత ఆగస్టు 30న ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కొందరు వ్యక్తులు ఇందిరానగర్‌లోని హోటల్‌ అనుపమలో సమావేశం నిర్వహించి, తమకు తాముగా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్నారని సుమలతా దేవి ఆరోపించారు. ఇది అసోసియేషన్‌ బైలాస్‌కు విరుద్ధమని పేర్కొన్నారు.

అసోసియేషన్‌ అధికారిక ఈమెయిల్‌ ఐడీని హ్యాక్‌ చేసి, జూబ్లీహిల్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు ఫోర్జరీ లేఖలు పంపి బ్యాంకు ఖాతాల సంతకాలను మార్చేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.

537 మంది సభ్యుల సంక్షేమం కోసం దాచిన సుమారు రూ.4 కోట్ల నిధులను కాపాడేందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని సుమలతా దేవి తెలిపారు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఇకపై అధ్యక్షుడు, జనరల్‌ సెక్రటరీ, ట్రెజరర్‌ ఉమ్మడి సంతకాలతోనే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తామని చెప్పారు.

కొత్త సభ్యత్వాల నమోదు కొనసాగింపు

లేబర్‌ ఆఫీస్‌ (JCL) మార్గదర్శకాలకు అనుగుణంగానే నూతన సభ్యత్వాల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు వ్యక్తులు, ప్యానెల్‌ ఇన్‌చార్జీల నిబంధనలను కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వివాదానికి తెరలేపారని జనరల్‌ సెక్రటరీ ఆరోపించారు.

కేవలం కాగితాలపై సంతకాలు చేసి నలుగురు కలిసి కమిటీగా ఏర్పడితే అది అసోసియేషన్‌ నిబంధనల ప్రకారం చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు. నకిలీ లెటర్‌హెడ్‌ల వినియోగంతో సభ్యుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరిగాయని, కోర్టు ఉత్తర్వులు వాటికి తగిన సమాధానమని ట్రెజరర్‌ ఇజ్రాయెల్‌ అన్నారు.

ఫెడరేషన్‌తో చర్చలు.. త్వరలో జనరల్‌ బాడీ

వివాద పరిష్కారానికి ఫెడరేషన్‌ అధ్యక్షుడు అనిల్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. ఫెడరేషన్‌ పెద్దల సమక్షంలో నాలుగైదు రోజుల్లో అధికారికంగా జనరల్‌ బాడీ సమావేశాన్ని నిర్వహించి, మిగిలిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి సభ్యులు అయోమయానికి గురికావద్దని వారు సూచించారు. ఏదైనా సమస్య లేదా సందేహం ఉంటే నేరుగా అసోసియేషన్‌ను సంప్రదించి వాస్తవాలను తెలుసుకోవాలని నృత్య కళాకారులు, డ్యాన్స్‌ డైరెక్టర్లకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *